విశాఖపట్నం (అల్లిపురం): ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా అంగవైకల్యాన్ని శాశ్వతంగా దూరం చేయవచ్చని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పిలుపునిచ్చారు. స్థానిక 32వ వార్డు పరిధిలోని అల్లిపురం, నేరేళ్ల కోనేరు వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ... 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. పిల్లలకు ఇప్పటికే సాధారణ టీకాలు అన్నీ పూర్తయినప్పటికీ, పల్స్ పోలియో కార్యక్రమాల్లో ఇచ్చే అదనపు డోసులు వారిని పోలియో మహమ్మారి నుండి సంపూర్ణంగా రక్షించడానికి ఎంతో అవసరమని చెప్పారు. సాధారణ టీకాలతో పాటు పల్స్ పోలియో చుక్కలు అదనపు రోగనిరోధక శక్తిని అందిస్తాయన్నారు. సమాజంలో పోలియో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి ఇది ఒకేసారి అందరికీ వేయించడం ముఖ్యమని తెలిపారు.ఈ చుక్కలు ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రత్యేక పోలియో బూత్‌ల ద్వారా పూర్తిగా ఉచితంగా, సురక్షితంగా ఇవ్వబడతాయన్నారు. పిల్లలకు జలుబు, జ్వరం లేదా ఇతర చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పోలియో చుక్కలు నిర్భయంగా వేయించవచ్చని, ఏదైనా సందేహం ఉంటే స్థానిక వైద్యులను సంప్రదించాలని సూచించారు. పుట్టిన శిశువుల నుండి ఐదు సంవత్సరాల వయస్సు నిండే వరకు ప్రతి ఒక్కరికీ ఈ డ్రాప్స్ తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.
జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వైద్య సిబ్బంది:
పోలియో బూత్‌లకు రాలేకపోయిన చిన్నారుల కోసం జూన్ 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. కేవలం రెండు చుక్కల పోలియో మందుతో పిల్లల భవిష్యత్తుకు ఆరోగ్య రక్షణ లభిస్తుందన్నారు. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, అందరి ఉమ్మడి సహకారంతోనే పోలియో రహిత సమాజం సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం. కే.విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు (ఏ.డబ్ల్యూ.డబ్ల్యూ) టి.పార్వతి, ఎల్.ప్రసన్న, ఎస్.మౌనిక, నాయకులు కే.కృష్ణ, కే.అప్పారావు, సిపిఐ బుజ్జి మరియు కే.ఎన్.ఆర్ (కందుల నాగరాజు) ఫాలోవర్స్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Comments