ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మారుతున్న కాలానికి తగినట్లుగా రూపాంతరం చెందడమే సమర్థవంతమైన నాయకత్వమని మంగళగిరిలోని తెదేపా కాన్‌క్లేవ్‌లో నాయకులకు స్పష్టం చేశారు. నాయకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ వద్దకు వచ్చిన ప్రజలతో నిజాన్నే చెప్పాలని సూచించారు. అయ్యే పనులను వెంటనే పూర్తి చేయాలని, సాంకేతికంగా వీలుకాని విషయాలను స్పష్టంగా చెప్పాలే తప్ప, ప్రజలను ఆశల్లో పెట్టి తమ చుట్టూ తిప్పుకోకూడదని స్పష్టం చేశారు. నాయకులు తమ నైతిక విలువలను వీడకుండా నడుచుకున్నప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి మండలంలోనూ 20 నుండి 30 మందితో కూడిన స్వచ్ఛంద సేవా దళాన్ని, వారితో పాటు సమాచారాన్ని విశ్లేషించే సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని మార్గదర్శనం చేశారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం పక్షపాతం లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం పార్టీ ప్రతినిధుల బాధ్యత అని తెలిపారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
ప్రతీ ఐదేళ్లకోసారి సమాజంలో ఓటింగ్ సరళి, నవతరం ఓటర్ల ఆలోచనా విధానం గణనీయంగా మారుతోందని గుర్తుచేశారు. కొత్త తరం ఓటర్ల అభిరుచులకు అనుగుణంగా నాయకులు తమ పాత పద్ధతులను పక్కనపెట్టి, పనితీరును ఆధునీకరించుకోవాలన్నారు. ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కాలంతో పాటు మారడమే బలమైన రాజకీయ పార్టీకి, నాయకత్వానికి అసలైన పునాది అని స్పష్టం చేశారు
Comments