విశాఖలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం: ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు!

By D M SATISH KUMAR , 6 September 2026
ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు!

సమాజ నిర్మాణంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు మరువలేనివని రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్స్ బి విజయభాస్కర్ కొనియాడారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొణతాల శ్రీనివాస్ అద్యక్షతన విశాఖపట్నంలో శనివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్స్ బి విజయభాస్కర్, విశిష్ట అతిధిగా జిల్లా ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎడ్యుకేషన్ జె చంద్రశేఖర రావు, జిల్లా ఉప విద్య శాఖ అధికారి ఏ  సోమేశ్వరరావు హాజరై మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆర్ జే డీ  బి విజయభాస్కర్ మాట్లాడుతూ గడిచిన కొద్ది సంవత్సరాలు నుంచి విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని, వారిలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి భవిష్యత్తు పునాది వేయాలని సూచించారు. జె చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులను కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో ఆరితేరిన విధంగా తీర్చిదిద్దాలని కోరారు. పోటీ ప్రపంచాన్ని తగ్గట్టుగా తనను తాను మార్చుకునేలా విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అలవాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి మురళి మనోహర్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ విద్యావ్యవస్థలో ఎనలేని మార్పులు తెచ్చిందని,  ముఖ్యంగా బడ్జెట్ స్కూళ్ల అభివృద్ధికి వాటి సమస్యలు పరిష్కారానికి గత 40 సంవత్సరాల నుంచి కృషి చేస్తూనే ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బి మణికుమార్,రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సూరిబాబు, జిల్లా కోశాధికారి ఈ శ్రీనివాసరావు,పలువురు  స్కూళ్ల కరస్పాండెంట్ లు,ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్స్‌ను,పాఠశాలల కరస్పాండెంట్లను అసోసియేషన్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

Comments

WhatsApp Share Button