ఉపాధ్యాయుల సేవలను అవార్డులతో కొలవలేమని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు.ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిశోర్, ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు,ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భాగంగా గత 14 సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ పిఎంశ్రీ జీవీఎంసీ హై స్కూల్ లో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న భాగవతుల శంకర్ కు కలెక్టర్ ఎం అభిషిక్త్ కిశోర్ చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందచేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత భాగవతుల శంకర్ మాట్లాడుతూ తనసేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని,తన భాద్యతను మరింత పెంచిందన్నారు. తనకు ఈ గౌరవం లభించడంతో సహకరించిన సహచర ఉపాధ్యాయులకు, కుటుంబసభ్యులకు,అధికారులకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments