విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కోరమాండల్ ఇంటర్నేషనల్ సీఎస్‌ఆర్ నిధులు, సమగ్ర శిక్షా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు గురువారం ప్రారంభించారు. శ్రీహరిపురం గణేష్ పార్కులో రూ. 15 లక్షలతో నిర్మించిన కోరమాండల్ కళావేదికను, మల్కాపురం జీవీఎంసీ హైస్కూల్‌లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన బాలికల టాయిలెట్ బ్లాక్, రూ. 23.10 లక్షల సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మూలగడలో రూ. 7.5 లక్షలతో ఆధునీకరించిన అంగన్‌వాడీ 2.0 కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కోరమాండల్ గ్రౌండ్‌లో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో 37 మంది మహిళలకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు, ఇస్త్రీ పెట్టెలు, కమర్షియల్ ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు పంపిణీ చేయడంతో పాటు వీధి వ్యాపారుల కోసం 100 పెద్ద గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు, పౌర స్పృహ పెరగాలని సూచిస్తూ వారికి "100 Heroes Freedom Fighters" పుస్తకాలను అందజేశారు. మహిళలు ఉపాధి పరికరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. సమాజ సేవకు నిధులు కేటాయిస్తున్న కోరమాండల్ కార్మికులను అభినందిస్తూ, భవిష్యత్ అవసరాల కోసం ఏఐ (AI), సాంకేతిక నైపుణ్యాల స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. షణ్ముగం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments