శాసనాన్ని ధిక్కరిస్తున్న 'నివాస' మరుగున 'వాణిజ్య' తిమింగలం: సచివాలయం 21086-507 వద్ద చట్టాలకు సమాధి.

By D M SATISH KUMAR , 26 August 2026
పెందుర్తి

పాలనపై నమ్మకం సడలుతున్న వేళ టౌన్ ప్లానింగ్ అధికారులకు కన్నులుండి అంధత్వమా?

విశాఖపట్నం (పెందుర్తి)  న్యాయము, ధర్మము, పౌర నియమావళి అంతరించిపోయిన వేళ అధికారుల వైఖరి 'కాకికి కాకి ముద్దు... అక్రమార్కులకు అధికారి అండ ముద్దు' అన్న చందంగా తయారైంది. పెందుర్తి నియోజకవర్గం సచివాలయం నంబర్ 21086-507 పరిధిలో సత్యం సమాధి అయి, చట్టం నిశ్చేష్టమై నిలబడిన ఒక ఘోర అక్రమ నిర్మాణం ఇప్పుడు జీవీఎంసీ వర్గాల్లో కాకరేపుతోంది. ప్రజాధనం, మేధావుల మేధోమథనం, ప్రభుత్వ కమిటీల సుదీర్ఘ శ్రమ ఫలితంగా రూపుదిద్దుకునే జీవోలు, మున్సిపల్ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. లక్షలాది రూపాయల వ్యయంతో రూపొందించిన జీవోలను యంత్రాంగమే బేఖాతరు చేస్తే ఇక ఆ చట్టాలు ఎవరి కోసం? కేవలం పేదవారు, గుడిసెలలో నివసించే వారిపైనే ప్రతాపం చూపడానికే ఈ నిబంధనలా? అని పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాలనా వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకమే క్రమంగా సడలిపోతోంది.

జివిఎంసి నిబంధనలను బహిరంగంగా పాతరేస్తూ సాగుతున్న ఈ నిర్మాణం వెనుక ఉన్న అసలు భగవద్గీత కాగితాల్లో ఒకటైతే... క్షేత్రస్థాయిలో మరోరూపమై భాసిల్లుతోంది. బిఎ నంబర్ PER/1086/3195/2026 పేరిట 133.95 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, కేవలం Ground + 2 Floors పరిమిత పరిధిలో, మూడు నివాస గృహాల కోసం మాత్రమే మంజూరైన 'ఇండివిడ్యువల్ రెసిడెన్షియల్' అనుమతిని కాలరాసి, దర్జాగా ఒక భారీ వాణిజ్య (Commercial) సముదాయాన్ని నిర్మిస్తుంటే అధికారులు కట్టుకున్న మౌనవ్రతం వెనుక ఉన్న అంతరార్థమేమిటి? ఈ మొత్తం ధర్మకర్తవ్యంలో పర్యవేక్షణ వహించాల్సిన వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ (WPRS) మంగ వైఖరి తీవ్ర సంశయాస్పదంగా మారింది. కళ్లెదుటే రెసిడెన్షియల్ ప్లాన్ రూపురేఖలు మారి, వాణిజ్య వ్యాపారానికి వేదికవుతున్నా, విధి నిర్వహణలో నిద్రమత్తు వదిలి కనీస తనిఖీలు చేపట్టకపోవడం, 'స్టాప్ వర్క్' నోటీసు జారీ చేయకపోవడం ఏ రకమైన రాచకార్యం?

ప్రభుత్వ ఉద్యోగిగా పౌరుల ఆస్తులకు, ప్రభుత్వ రాబడికి జవాబుదారీగా ఉండాల్సిన స్థానంలో ఉండి, అక్రమ నిర్మాణానికి మూగనోముతో కాపలా కాయడం విధిద్రోహం కాదా? రెసిడెన్షియల్ ప్లాన్‌తో కమర్షియల్ ప్రాజెక్టును మళ్లించడం అంటే కేవలం భవన నిర్మాణ సూత్రాల ఉల్లంఘన మాత్రమే కాదు, మున్సిపల్ బొక్కసానికి చేరాల్సిన ప్లాన్ మార్పిడి ఫీజులు, వాణిజ్య పన్నులు, యూజర్ ఛార్జీలను రాబంధులవలె పీక్కు తినడమే. సామాన్యుడు చిన్న నిర్మాణం చేపడితే నోటీసుల సుదర్శన చక్రం తిప్పే టౌన్ ప్లానింగ్ యంత్రాంగం, లక్షలాది రూపాయల ప్రభుత్వ రాబడికి రంధ్రం పడుతున్నా కుంభకర్ణ నిద్రపోవడం వెనుక ఏ రకమైన మామూళ్ల మత్తు ఉందో సమగ్ర విచారణలోనే బట్టబయలు కావాల్సి ఉంది. జీవీఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసి, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ మంగపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ జీవోలకు, చట్టాలకు ఉన్న ప్రాధాన్యతను నిలబెట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Comments

WhatsApp Share Button