అయ్యో పాపం... ప్లాన్ పెట్టాలని తెలియదంట!’: వింత సమాధానాలు చెప్తున్న ప్లానింగ్ అధికారులు

By D M SATISH KUMAR , 25 August 2026
వెంకటాపురం

భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తే బుల్డోజర్లు పంపుతామని కాగితాల్లో చెప్పే అధికారులు, క్షేత్రస్థాయిలో తీరా అక్రమ నిర్మాణం పూర్తయ్యాక చెప్తున్న సమాధానాలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కంటిముందే ప్లాన్ లేకుండా పునాదులు తీసి, గోడలు కట్టి, ఏకంగా స్లాబ్ నిర్మాణం వరకు పూర్తి చేసినా నోరు మెదపని అధికారులు... తీరా ఆ పనులేంటని నిలదీస్తే “పాపం... బిల్డింగ్ యజమానికి ప్లాన్ పెట్టుకోవాలని తెలియక స్లాబ్ వరకు కట్టేశారంట!” అంటూ యజమాని తరఫున వకాల్తా పుచ్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే స్వయంగా అనధికార నిర్మాణాలకు ‘అజ్ఞానం’ రక్షణ కవచంగా మార్చి సమాధానం చెప్పడం వెనుక ఉన్న గుట్టు ఏంటో సామాన్యుడికి కూడా అర్థమవుతూనే ఉంది. ప్లాన్ లేకుండా నిర్మాణం జరుగుతుంటే మొదటి రోజు నుంచే పర్యవేక్షించాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, స్లాబ్ పడేంత వరకు వేచి చూసి, ఆ తర్వాత ఈ రకమైన సాకులు చెప్పడం వెనుక అసలు కథ వేరే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. స్లాబ్ పడేంత వరకు ముడుపుల మౌనం పాటించి, పని పూర్తయ్యాక ఇలాంటి ‘అమాయకపు’ వ్యాఖ్యలతో తప్పించుకోవడమేంటని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది నిబంధనలు అమలు చేయడానికా లేక నిబంధనలు ఉల్లంఘించిన వారికి సలహాలు, రక్షణ ఇవ్వడానికా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యజమానికి తెలియదనడం అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఇలాంటి  సమాధానాలు చెప్తూ అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.

Comments

WhatsApp Share Button