గోపాలపట్నం జూన్ 26 : (pr newstoday) తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే ఓ పాత నేరస్థుడిని గోపాలపట్నం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సింహాచలంలోని ప్రియ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ మిస్టరీని పోలీసులు వేగంగా చేధించి, మల్కాపురం నివాసి అయిన నూనెల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియ గార్డెన్స్ పరిధిలో ఉంటున్న ఉలిమిరి కావ్య హర్షిత అనే మహిళ మే 24వ తేదీ రాత్రి తన ఫ్లాట్‌కు లాక్ చేసి బయటకు వెళ్లారు. అదే సమయంలో నిందితుడు ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరిచిన వస్తువులపై పడ్డాడు. ఒక నెక్లెస్, ఒక జత గాజులు, రెండు గోల్డ్ బిస్కెట్లు, ఒక జత చెవి స్టడ్స్, ముక్కుపుడక, రెండు లాకెట్లతో కూడిన మొత్తం 100 గ్రాముల బంగారు నగలను దోచుకెళ్లాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 144/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ క్రమంలో జూన్ 24న గోపాలపట్నంలోని ఇందిరా నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నూనెల కృష్ణను క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి శైలిలో ప్రశ్నించడంతో తనే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన 100 గ్రాములకు పైగా బంగారాన్ని విజయనగరంలో భూమిలో పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన విచారణలో గాజువాక శ్రీనగర్ పరిధిలో కూడా మరో ఇంటి దొంగతనం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దాంతో అతని వద్ద నుండి మరో ఒకటిన్నర తులాల బంగారు వస్తువులను వశపరుచుకున్నారు. పట్టుబడిన నిందితుడిపై గతంలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 30 కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇంతటి పాత నేరస్థుడిని పట్టుకుని, కేసును చాకచక్యంగా చేధించిన క్రైమ్ సిబ్బందిని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు. ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రక్షణ కోసం ఇళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచించారు.
- Log in to post comments
Comments