పెందుర్తి, జూన్ 25: యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవి సతీష్ కుమార్ సూచనల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని నాయుడు తోటలోని భాష్యం స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత విలువైన సమయమని, ఈ సమయంలో మంచి అలవాట్లు పెంపొందించుకోవడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు. গంజాయి, మద్యం, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చదువు, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. క్షణిక ఆనందం కోసం జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోవద్దని, మంచి స్నేహితులను ఎంచుకోవడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సే నో టు డ్రగ్స్ - సే ఎస్ టు లైఫ్ నినాదంతో విద్యార్థులు ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments