పీవీ ఔన్యత్యాన్ని చాటిచెప్పేలా విశాఖలో పివి జయంతి

By Nareshkarri111 , 26 June 2026
భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ    భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి

భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ    భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి కార్యక్రమం ఈ నెల 28న విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పివి నరసింహారావు జయంతి ఉత్సవాల కమిటీ ప్రకటించింది. శుక్రవారం శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు కేశాప్రగడ నరసింహమూర్తి, కన్వీనర్ చెరుకు రామకోటయ్య కార్యక్రమ వివరాలు వెల్లడించారు.భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు తన దూరదృష్టి, రాజకీయ చాణక్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను పెంచిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమం రాజకీయాలకు,పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పి.వి. నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, ఉదయం 10 గంటలకు దసపల్లా హోటల్‌లో ప్రధాన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జివిఎల్  నరసింహారావు అధ్యక్షత వహించనున్నారని,విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, టీడీపీ తదితర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మొదటి పివి నరసింహారావు విగ్రహానికి ప్రభుత్వం తగిన మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లభించలేదని నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమిటీ ఆధ్వర్యంలోనే విగ్రహానికి మరమ్మతులు చేయించి, జయంతి కార్యక్రమం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.పివి నరసింహారావు ఆశయాలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను యువతకు పరిచయం చేయడమే జయంతి ఉత్సవాల ప్రధాన లక్ష్యమని, ప్రజలు, మేధావులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో వేదుల హనుమంత రావు, రాచకొండ దశరథ రామయ్య,గంటి రవికుమార్, చరణ్ కుమార్, గంటి మురళి, శివ గణేష్ శర్మ,గాడేపల్లి ప్రభాకర శాస్త్రి, వేదుల రామకృష్ణ, నేరెళ్ళ కామేశ్వర శర్మ, కొలిగట్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Comments

WhatsApp Share Button